ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ప్రజలకు మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. గురువారం మంగళగిరిలో జరిగిన ‘మన ఇల్లు- మన లోకేశ్’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు.

మంగళగిరిలో అభివృద్ధి
మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, మంగళగిరి ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తానని స్పష్టం చేశారు. ప్రజలు తనపై చూపించిన అపార విశ్వాసానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తన నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నానని వెల్లడించారు. 26 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మంగళగిరిలో అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రధానంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు-పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, నీటి సరఫరా కోసం ప్రత్యేక చర్యలు, సూపర్ సిక్స్ హామీల అమలు, నూతనంగా ఆసుపత్రుల నిర్మాణం, ఉచిత మెడికల్ క్యాంపుల ఏర్పాటు, మహిళల ఉపాధి కోసం ప్రత్యేక పథకాలు
వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన
నారా లోకేశ్ మంగళగిరి ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ఏప్రిల్ 13న వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది అదే తేదీన ఆసుపత్రి ప్రారంభోత్సవాన్ని నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు లభించనున్నాయి. మంగళగిరి, తాడేపల్లిలో ఇప్పటికే ‘ఎన్టీఆర్ సంజీవని’ పేరుతో క్లినిక్‌లు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. మంగళగిరిలో నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మంత్రి చెప్పారు. ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తున్నట్లు తెలిపారు. రోడ్లు, మురుగు కాల్వల అభివృద్ధి, విద్యుత్, మంచినీటి సరఫరాకు ప్రత్యేక ప్రణాళిక, పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచే చర్యలు నిరుపేదలకు తోపుడు బండ్లు, కుట్టుమిషన్లు అందజేసినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ పేదలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. మంగళగిరిలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా స్కిల్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు అమలు చేయనున్నట్లు చెప్పారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడంలో ముందడుగు వేసినట్లు మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమే తన ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తానని హామీ ఇచ్చారు.