Nara Lokesh : రోడ్డు విస్తరణ పై నేడు శంకుస్థాపన చేసిన నారా లోకేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తన యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు 14 కి.మీ. మేర రహదారి విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. యువగళం పాదయాత్ర సమయంలో ఈ ప్రాంత ప్రజలు రహదారి విస్తరణ అవసరాన్ని లోకేశ్‌కు వివరించగా ఆయన వెంటనే హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ నిజమైంది. ప్రస్తుతం డబుల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని రూ.347 కోట్ల వ్యయంతో 4 లేన్ల రహదారిగా మారుస్తున్నారు.ఈ ప్రాజెక్ట్‌ను రెండు సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయనున్నారు. ఇందులో భాగంగా అచ్యుతాపురం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, రెండు మైనర్ బ్రిడ్జిలు, 47 కల్వర్టులను నిర్మించనున్నారు. ఈ ప్రాంతం విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (VCIC), జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీ స్పెషల్ ఎకనమిక్ జోన్‌లో భాగంగా అభివృద్ధి చెందుతున్న రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ పారిశ్రామిక క్లస్టర్లకు దగ్గరగా ఉంది.

భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ రహదారి విస్తరణ చేపట్టనున్నారు.ఈ రహదారి విస్తరణ అనకాపల్లి సమీపంలోని NH-16 జంక్షన్ నుంచి ప్రారంభమై అచ్యుతాపురం వద్ద ముగుస్తుంది. ఇది హరిపాలెం రోడ్డు, పూడిమడక రోడ్డు వెంబడి ఉన్న నివాసాలు, పారిశ్రామిక సంస్థలు, మత్స్యకార గ్రామాలకు ముఖ్యమైన కనెక్టివిటీగా మారుతుంది. అంతేకాదు, ఇది అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో 5595.47 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న APSEZ కు కీలకమైన రోడ్డు మార్గంగా నిలుస్తుంది.అనకాపల్లి సమీపంలోని నక్కపల్లి వద్ద ఆర్సెలర్ మిట్టల్ సంస్థ రూ.1.4 లక్షల కోట్లతో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్‌కు కూడా ఈ రహదారి ప్రాముఖ్యతను పెంచుతుంది. అలాగే, APSEZ పరిసరాల్లోని 180 పరిశ్రమలకు, ఇతర ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలకు ఈ రహదారి కీలక అనుసంధాన మార్గంగా మారనుంది. రోజూ లక్షకు పైగా ఉద్యోగులు ఈ మార్గంలో ప్రయాణిస్తారని అంచనా. ఈ రహదారి విస్తరణ వల్ల అచ్యుతాపురం, మునగపాక, అనకాపల్లి మండలాల్లో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశముంది.