పార్వతీపురం: ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రైవేటురంగానికి మించి అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తెస్తున్నామని, అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నా, సంస్కరణల ద్వారా రాబోయే నాలుగేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ అవార్ట్స్ (Shining Star) -2025లో భాగంగా పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
మెరుగైన ఫలితాల సాధనకు వందరోజుల యాక్షన్ ప్లాన్
ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో పదోతరగతిలో ప్రతిభ కనబర్చిన 95మంది, ఇంటర్మీడియట్ లో ప్రతిభకనబర్చిన 26మందిని మంత్రి లోకేష్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ మెరుగైన ఫలితాల సాధనకు వందరోజుల యాక్షన్ ప్లాన్ అమలుచేస్తున్నామన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజిల్లో పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాం. ఇది సంస్కరణల్లో తొలి అడుగు మాత్రమే. మీరు ఆంధ్రప్రదేశ్ బిడ్డలు, మీ ప్రతిభను గుర్తించే బాధ్యత నాదన్నారు.
ఉన్నత చదువులు చదివి తిరిగి పాఠశాలలకు సేవ చేయాలి
రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తిరిగి మీ పాఠశాలలకు సేవచేయాలన్నారు. సాధించిన విజయాలు భారతదేశానికి తెలియాల్సిన అవసరం ఉందని. పేదరికం నుంచి బయటపడటానికి చదువే ఏకైక మార్గమన్నారు. జీవితంలో ఏం కోల్పోయినా చదువును ఎవరూ దూరంచేయలేరని, హ్యాట్రిక్ సాధించిన పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు అభినందనీయులన్నారు.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలనే లక్ష్యంతో అనేక సంస్కరణలు తెస్తున్నాం. పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించాలని ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నాం. మీకు అద్భుతమైన ఫౌండేషన్ ఉంది. అవకాశాలను నిచ్చెనమెట్లుగా ఉపయోగించుకుని మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలి. మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
పదోతరగతి విద్యార్థులకు ఇప్పటినుంచే అసలు పరీక్ష మొదలవుతుందని, దానిపేరే జీవితం అన్నారు. పరీక్ష పెట్టే భగవంతుడే జయించేశక్తి కూడా దేవుడు ఇస్తాడు. కష్టాలు అందరికీ ఉంటాయి, వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న వారే విజేతలుగా నిలుస్తారు. విద్యార్థులు ప్రశ్నించడం ద్వారా తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా డ్రీమ్ వాల్, యాంబిషన్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్ పై విద్యార్థినీ, విద్యార్థులు తమ మనోభావాలను వ్యక్తీకరించారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయి దేశానికి సేవచేస్తానని భీమిని ఎపి మోడల్ స్కూలు విద్యార్థిని జి.జితు, ఐఎఎస్ అధికారిని అవుతానని జి.జగదీష్, టీచర్ నై ఉత్తమ పౌరులను తయారుచేస్తానని భీమిని కెజిబివి జూనియర్ కాలేజి విద్యార్థిని సిహెచ్ ప్రియాంక, ఇంజనీరింగ్ చదివి దేశాభివృద్ధిలో కీలకమైన రోడ్లు వేస్తానని బోదెల జ్యోత్స్న తమ జీవిత లక్ష్యాలను వాల్ పై రాశారు. డాక్టర్ అయి పేదలకు సేవచేస్తానని నిడగల్లు జడ్ పిహెచ్ ఎస్ స్కూలుకు చెందిన ఆర్.ప్రజ్ఞ, ఎఐ ఇంజనీర్ అవుతానని పాలకొండ తమ్మినాయుడు స్కూలుకు చెందిన వావిళ్లపల్లి గాయత్రి, సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ చదివి చాట్ జిపిటి వంటి నవీన ఆవిష్కరణలు చేస్తానని పాలకొండ సత్యసాయి జూనియర్ కళాశాలకు చెందిన కొమరపు గుణశ్రీ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి, విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికాశుక్లా, కళాశాల విద్య డైరక్టర్ నారాయణ భరత్ గుప్త, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఐటిడిఎ పిఓ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.
Read Also : Honeymoon Murder:రఘువంశీ తలపై బలమైన గాయాలు పోస్టుమార్టంలో వెల్లడి