భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)కి మరో అరుదైన అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఐదు దేశాల పర్యటనలో చివరిగా నమీబియాకు చేరుకున్న మోదీకి, ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్‌విట్షియా మిరాబిలిస్’ అందజేశారు.బుధవారం నమీబియాలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో అధ్యక్షురాలు నెతుంబో నంది-ద్వైత్వా (President Netumbo Nandi-Dwaitwa) ఈ గౌరవాన్ని ప్రధాని మోదీకి అందించారు. ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ నాయకుడిగా మోదీ నిలిచారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీకి ఇదే 27వ అంతర్జాతీయ గౌరవంగా నిలిచింది.

నమీబియాలో ప్రధాని మోదీ తొలి పర్యటన
ప్రధానమంత్రి హోదాలో మోదీ నమీబియాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్బంగా ఆయన నమీబియా అధ్యక్షురాలితో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఆరోగ్య రంగం, ఇంధనం, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో భాగస్వామ్యం కోసం నాలుగు ఒప్పందాలు కూడా కుదిరాయి. భారత్-నమీబియా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన దోహదపడనుంది.
ఇతర దేశాల్లో కూడా గౌరవం
ఈ నెల 2న మోదీ ఐదు దేశాల పర్యటన మొదలైంది. ఇప్పటివరకు ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలను సందర్శించారు. బ్రెజిల్‌లో రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ సదస్సులో కూడా పాల్గొన్నారు. ఈ పర్యటనలో అర్జెంటీనా మినహా మిగిలిన నాలుగు దేశాల అత్యున్నత పురస్కారాలు మోదీకి లభించటం విశేషం.
భారత ఔన్నత్యానికి గుర్తింపుగా
ప్రపంచవ్యాప్తంగా మోదీకి లభిస్తున్న గౌరవాలు, భారత దేశానికి పెరుగుతున్న ప్రాధాన్యతను స్పష్టంగా చూపిస్తున్నాయి. విదేశాల్లో భారత ప్రధానిని ఈ స్థాయిలో గౌరవించడం దేశ అభివృద్ధికి ప్రతిబింబంగా మారుతోంది.
Read Also : Chandrababu : ఏపీలో రేపు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్