బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక ప్రభుత్వ సలహాదారుగా ఉన్న నహీద్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను చీఫ్ అడ్వైజర్ మహమూద్ యూనస్ కు అందజేశారు. నహీద్ ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే, ఆయన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బంగ్లాదేశ్‌లో రాజకీయ మార్పు కోసం, ప్రజల సమస్యలను ప్రాతినిధ్యం వహించేందుకు ఆయన కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.

యువతలో ఆయనకు మంచి ఆదరణ
నహీద్ ఇస్లాం ఢాకా యూనివర్సిటీ విద్యార్థిగా ఉండగానే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. యువతలో ఆయనకు మంచి ఆదరణ ఉంది. ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా, నహీద్ నాయకత్వంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు చేపట్టి, ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. రాజకీయంగా మద్దతును పెంచుకోవడానికి, ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారేందుకు నహీద్ సొంత పార్టీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
నహీద్ ఇస్లాం కొత్త పార్టీ ఏర్పాటుతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో నూతన మార్పులకు మార్గం సుగమం అవుతుందా? అనే ప్రశ్న రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుండటంతో, నహీద్ ఇస్లాం పార్టీ ప్రభావం ఎంత వరకు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. యువతను, విద్యార్థులను సమీకరించి, ఆయన బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతారా? లేక రాజకీయంగా ఎదుర్కొనే సవాళ్లను అధిగమించగలరా? అనే అంశాలు త్వరలో స్పష్టత చెంది కొత్త మార్గాన్ని చూపే అవకాశం ఉంది.