అమరావతి: జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు. రిటర్నింగ్ అధికారిణి వనితారాణికి నాగబాబు నామపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, అలాగే నామినేషన్‌ను బలపరిచిన లోకేష్, మనోహర్‌కు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు.

ఐదు స్థానాల్లో ఒక అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ ఖరారు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని సమాచారం అందించారు. ఇందులో భాగంగా నిన్న నాగబాబుతో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఐదు స్థానాల్లో ఒక అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారైన విషయం తెలిసిందే. కాగా, ముందుగా నాగబాబును రాజ్యసభకు పంపిస్తారంటూ వార్తలు వచ్చాయి. విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో నాగబాబును పంపించాలని అనుకునున్నప్పటికీ ఆ స్థానాన్ని ఖాళీ చేయించింది బీజేపీ కాబట్టి… ఆ స్థానాన్ని కమలం పార్టీకి వదలాలి అనే సూచనలు కూడా వచ్చాయి.