జమ్ము కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా బుధాల్ గ్రామంలో వింత వ్యాధి కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యాధి కారణంగా రెండు కుటుంబాల్లో ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. ఇంకా 11 మందికి ఈ వ్యాధి సోకినట్లు స్థానిక వర్గాలు తెలిపారు. ఈ వ్యాధి పై ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ (GMC)లో ఈ వ్యాధితో బాధపడుతున్న రోగుల కోసం ప్రత్యేక చికిత్సా కేంద్రం ఏర్పాటు చేశారు. అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స అందించేందుకు వైద్య బృందాలు కృషి చేస్తున్నాయి.
ఈ వ్యాధి చిన్నారులపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ వెల్లడించారు. కళ్లముందే పిల్లలు ప్రాణాలు కోల్పోతున్న దృశ్యాలను తల్లిదండ్రులు చూడలేక, తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ విషాదకర పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే అత్యవసర చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎమర్జెన్సీ తరలింపుల కోసం ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఇక్బాల్ కోరారు. రోగులను మెరుగైన వైద్యం అందించే కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రస్తుతం ఈ వింత వ్యాధి వివరాలు వెలుగులోకి రానప్పటికీ, అధికారులు దీని మూలాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యాధి లక్షణాలు, వ్యాప్తి పద్ధతులపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి స్థాయి సహాయం అందిస్తే, మరిన్ని ప్రాణ నష్టం నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.