దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ముంబై (Mumbai) నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో ముంబై (Mumbai)నగరం మొత్తం తడిసిముద్దైంది. ముంబై(Mumbai)లోని ప్రధాన ప్రాంతాలైన కుర్లా, సియోన్, దాదర్, పరేల్‌లోని అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లోని వీధులు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే సహాయక చర్యలను స్టార్ట్ చేసింది. అయితే, రాబోయే గంటల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎవైనా కార్యక్రమాలు ఉంటే వాటిని వాయిదా వేసుకోవాలని సూచించింది.

చెరువులుగా మారిన రహదారులు
అయితే, ముంబైలోని నారిమన్ పాయింట్ ప్రాంతంలో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య 40 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ అధికారులు తెలిపారు. గ్రాంట్ రోడ్‌లో 36 మి.మీ, కొలాబాలో 31 మి.మీ, బైకుల్లాలో 21 మి.మీ వర్షపాతం నమోదైనట్టు స్పష్టం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచిపోవడంతో సబర్బన్ రైల్వే సర్వీసులు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా ముంబైకి ఎయిర్‌పోర్ట్ నుంచి రాకపోకలు సాగించే విమానాల సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. దీంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు.
సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాలు
మరోవైపు మహారాష్ట్ర ఆర్థిక మంత్రి అజిత్ పవార్ సోమవారం ఉదయం బారామతిలోని వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా అన్ని భద్రతా సంస్థలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అయితే దాదాపు 35 ఏళ్ల తర్వాత తొలిసారిగా మహారాష్ట్రలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణశాఖ తెలిపింది. ఈసారి ముంబై వర్షాలు సాధారణ వర్షాలు కాదు. రుతుపవనాల ఉధృతితో ముంబై నగర జీవన విధానాన్నే స్తంభింపజేశాయి. అధికారులు స్పందించగా, ప్రజలు సహకారం చూపుతూ అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. రాబోయే మూడు రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలుకు ఇవి విస్తరించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
Read Also: Scheme: నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ. 4,500.. నిజమిదే!