Tahawwur Rana : ముంబయి పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాకు ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్‌కు అప్పగించొద్దంటూ అమెరికా సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా తహవూర్ రాణా పిటిషన్ తిరస్కరణకు గురయ్యింది. దీంతో అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. తన అప్పగింతను అత్యవసరంగా నిలిపివేయాలంటూ ఇటీవల రాణా యూఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. భారత్‌కు పంపిస్తే అక్కడ తనను చిత్రహింసలకు గురిచేస్తారని అందులో ఆరోపించాడు. దీనిపై తాజాగా విచారణ జరగ్గా.. రాణా పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అక్కడి న్యాయస్థానం పేర్కొంది. తహవూర్ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి.

అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్
ప్రస్తుతం లాస్ ఏంజెలెస్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని తమకు అప్పగించాలంటూ కొంతకాలంగా భారత్ పోరాడుతోంది. దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ రాణా పలు ఫెడరల్ కోర్టులతో పాటు శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్ కోర్టును సైతం ఆశ్రయించాడు. ఆయా న్యాయస్థానాల్లో అతడికి చుక్కెదురైంది. ఈక్రమంలో గతేడాది నవంబరు 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయగా అక్కడా నిరాశే ఎదురైంది. రాణా అప్పగింతపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘26/11 ముంబయి ఉగ్ర దాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్ కు అప్పగిస్తున్నాం. అలాగే త్వరలో మరింతమంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటాం’’ అని వెల్లడించారు.
Read Also : భారతీయులు గొప్ప ప్రతిభావంతులు – బిల్ గేట్స్