న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను బీజేపీ కీలక నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఢిల్లీలోని కేంద్రమంత్రి నివాసంలో ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు వినతిపత్రాలను కేంద్రమంత్రికి అందజేశారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు RUB, ROB పనులను అభివృద్దికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులను సత్వరమే పూర్తి చేయాలని కోరారు.దీనికి తోడు మేడ్చల్ రైల్వే స్టేషన్లో పలు రైళ్ళను నిలుపుదల చేయాలని ఈ సందర్భంగా కోరినట్లు తెలుస్తోంది. అదే విధంగా కరోనా సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలని కోరారు. అనంతరం రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై సైతం వారిద్దరి మధ్చ చర్చ జరిగినట్లు సమాచారం.
ఇకపోతే..కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా సమావేశమయ్యారు. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సామర్లకోట – ఉప్పాడ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అవసరం ఉందని, సత్వరమే ఈ ఆర్వోబీని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో అశ్విని వైష్ణవ్ తో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పలు రైల్వే ప్రాజెక్టులు, ప్రజల అవసరాల గురించి చర్చించారు.
‘పిఠాపురం పట్టణ పరిధిలోని V-V సెక్షన్‌లో, సామర్లకోట-ఉప్పాడ రోడ్డులో రైల్వే కి.మీ 640/30-32 వద్ద లెవెల్ క్రాసింగ్ నంబర్ 431కి బదులుగా ఆర్‌ఓబీ అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నిరంతరంగా ఉండే ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి, ఆ ప్రాంతంలో రోడ్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఈ మౌలిక సదుపాయాల కల్పన చాలా అవసరం. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి ‘గతి శక్తి’ కార్యక్రమం ద్వారా మంజూరు చేయాల’ని కోరారు.