కమెడియన్ నుండి దర్శకుడిగా మారి, తన మొదటి సినిమా ‘బలగం’తోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించిన వేణు యెల్దండి, తన రెండో సినిమాగా ‘ఎల్లమ్మ’ ను ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. ‘బలగం’ సినిమాలో చావు చుట్టూ ఉండే భావోద్వేగాలను, తెలంగాణ పల్లెటూరి సంస్కృతిని అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించి జాతీయ అవార్డులను సైతం అందుకున్న వేణు, ఈసారి కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ‘ఎల్లమ్మ’ గ్లింప్స్ చూస్తుంటే, వేణు మరోసారి మట్టి వాసనతో కూడిన ఎమోషనల్ డ్రామాను నమ్ముకున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ చిత్రం ప్రధానంగా దైవం-ఆచారం అనే అంశాల చుట్టూ తిరుగుతుందని సమాచారం. తెలంగాణ లోగిళ్లలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి నేపథ్యాన్ని ఈ కథ కోసం ఎంచుకున్నట్లు గ్లింప్స్ సూచిస్తోంది. సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ప్రజల నమ్మకాలను, ఆ నమ్మకాల వెనుక ఉండే మానవీయ సంబంధాలను వేణు తనదైన శైలిలో ఈ సినిమాలో చూపించబోతున్నారు. ‘బలగం’లో కుటుంబ సంబంధాలకు పెద్దపీట వేసిన ఆయన, ‘ఎల్లమ్మ’లో భక్తికి, గ్రామీణ ఆచారాలకు మధ్య ఉండే అనుబంధాన్ని ఒక పవర్‌ఫుల్ ఎమోషనల్ జర్నీగా తీర్చిదిద్దినట్లు సినీ వర్గాల భోగట్టా.
Talasani : తలసానిపై కేసు.. వివాదం ఏంటి?
నిర్మాణ విలువల పరంగా చూస్తే, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ‘బలగం’ మాదిరిగానే ఈ సినిమాకు కూడా సహజ సిద్ధమైన లోకేషన్లు, మట్టి పాటలు మరియు బలమైన పాత్రలే ప్రధాన బలం కానున్నాయి. వేణు యెల్దండి తన కథా బలంతో మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను భావోద్వేగాలకు గురి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ‘బలగం’ ఫార్ములాను కేవలం కాపీ చేయకుండా, అంతకంటే లోతైన సామాజిక అంశాలను స్పృశిస్తూ వేణు చేస్తున్న ఈ ప్రయత్నంపై అటు పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.