సినీ రంగంలో గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఒక వైపు అయితే, నటిగా పేరు తెచ్చుకోవడం మరో వైపు ఉన్న కఠినమైన ప్రయాణం. ఈ రెండింటినీ సమన్వయం చేయగల నటీమణులు చాలా అరుదుగా కనిపిస్తారు. తాజాగా ఆ దిశగా అడుగులు వేస్తున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో తన అందం, ఆకర్షణతో యువతను మంత్రముగ్ధులను చేసిన భాగ్యశ్రీ, ఇప్పుడు ‘కాంత’ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. కమర్షియల్ సినిమాల ద్వారా పేరుప్రతిష్ఠలు పొందినా, ‘నటిగా గుర్తింపు’ పొందడమే తన అసలైన లక్ష్యమని ఆమె చెబుతోంది.
భాగ్యశ్రీ మాట్లాడుతూ .. “మిస్టర్ బచ్చన్ కంటే ముందే నేను కాంత కథ విన్నాను. కానీ షూటింగ్ ఆలస్యమవడంతో ఆ మధ్యలో మరో రెండు సినిమాలు చేశాను. నిజానికి టెక్నికల్‌గా నా మొదటి సినిమా కాంతే. ఇందులో నేను కుమార్తె పాత్రలో నటిస్తున్నాను. ఇది సవాలుగా భావించి చాలా శ్రద్ధతో చేశాను. పాత తెలుగు, తమిళ సినిమాలు చూశాను. శ్రీదేవి గారు, సావిత్రి గారు చేసిన పాత్రల్ని గమనించి, వాటి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను” అని తెలిపింది. ఒక కొత్త నటి కి ఇలాంటి ఇమోషనల్ రోల్ రావడం అదృష్టమని, ఈ సినిమా తన కెరీర్‌లో ఒక మలుపుగా నిలుస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది.

దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాంత సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. భాగ్యశ్రీ ఈ సినిమాలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటే, అది ఆమెకు ఒక కొత్త దిశ చూపించే అవకాశం ఉంది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్‌లో మాత్రమే కనిపించిన ఆమె, ఈ సినిమాలో భావోద్వేగపూరితమైన పాత్రతో మెప్పిస్తే, భవిష్యత్తులో మరిన్ని విభిన్న పాత్రల ఆఫర్లు రావడం ఖాయం. ఇలా గ్లామర్‌తో పాటు నైపుణ్యాన్ని కలిపి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోవాలన్న భాగ్యశ్రీ ప్రయత్నం, సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.