ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya) తాజాగా సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో పలువురు నెటిజన్లు తరచూ విమర్శలు చేస్తుంటారు. “ఇద్దరు పిల్లల తల్లిగా ఇలా షార్ట్ దుస్తులు ధరించడం ఏమిటి?” అంటూ అనసూయపై ట్రోలింగ్ కొనసాగుతోంది. అనసూయ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓపెన్ లెటర్ షేర్ చేస్తూ తన మనసులోని బాధను బయటపెట్టింది. తల్లి అయిపోయిన తర్వాత ఒక మహిళ తన స్వేచ్ఛను త్యాగం చేయాలా? అనే ప్రశ్నతో ఆమె ఓపెన్‌గా స్పందించారు.
“నా జీవనశైలి నాది, నన్ను నేను నిర్ణయించుకుంటాను”
అనసూయ తన లెటర్‌లో, ఎవరి జీవితశైలినైనా విమర్శించడం తగదని స్పష్టం చేశారు. తాను ఒక భార్య, తల్లి అయినప్పటికీ తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే దుస్తులు ధరిస్తానని, అందులో తప్పేమీ లేదని పేర్కొన్నారు. ‘‘నన్ను విమర్శిస్తున్నవారు కొందరు మహిళలే కావడం విచారకరం. వారు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నా, వారికి నేను ఎవరో తెలియదు. అయినా సరే, నా జీవనశైలి పై తీర్పు చెబుతున్నారు’’ అని పేర్కొన్నారు. బోల్డ్ గా కనిపించడం అంటే అగౌరవంగా ప్రవర్తించడం కాదు అని స్పష్టం చేస్తూ, తన కుటుంబం తనను అర్థం చేసుకుంటుందని, ప్రేమిస్తుందని తెలిపింది.
ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి – అనసూయ విజ్ఞప్తి
తాను ఎవరినీ తన మార్గాన్ని అనుసరించమని చెప్పడం లేదని, అదే విధంగా ఇతరుల జీవనశైలిని గౌరవించాలని కోరుతున్నట్లు అనసూయ తెలిపారు. ప్రతి ఒక్కరికీ తమ జీవితం తమదే అని ఆమె అభిప్రాయపడుతూ, సమాజంలో ఉన్న విభిన్నతలను విమర్శలు లేకుండా అంగీకరించగలిగితేనే మనమంతా కలసి ముందుకు పోగలమని చెప్పారు. ‘‘నేను ప్రేమతో, ధైర్యంగా, స్వేచ్ఛతో బ్రతుకుతాను. అదే సమయంలో ఇతరుల్ని గౌరవించడం కూడా మరిచిపోను’’ అంటూ తన బలమైన స్టేట్‌మెంట్‌తో ఆమె తన పోస్టును ముగించారు. ఈ పోస్ట్‌పై అనేక మంది అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
Read Also : Gopichand Badminton Academy : ఏపీలో గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ