ఈ ఏడాది ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కాల్లో (71st National Film Awards 2025) తెలుగు చిత్రసీమకు ఘనమైన గుర్తింపులు లభించాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ నటించిన “భగవంత్ కేసరి” ఉత్తమ తెలుగు ఫీచర్ చిత్రంగా ఎంపిక కావడం తెలుగు ప్రేక్షకులకు గర్వకారణంగా నిలిచింది. అనిల్ రవిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సాంఘిక అంశాలతో కూడిన బలమైన కథను ప్రేక్షకుల ముందు ఉంచింది. అలాగే హనుమాన్ సినిమాకు ఉత్తమ యాక్షన్ డైరెక్షన్, స్టంట్ కోరియోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో జాతీయ అవార్డులు లభించడం విశేషం.
తెలుగు పాటలు, రచయితలకు ప్రత్యేక గుర్తింపు
తెలుగు చలనచిత్ర గీత రచనకు ఈ సంవత్సరం ప్రత్యేక గుర్తింపు లభించింది. “బలగం” సినిమాలోని “ఊరు పల్లెటూరు” అనే పాటకు గీత రచయిత కాసర్ల శ్యామ్ జాతీయ అవార్డును అందుకున్నారు. అలాగే “బేబీ” సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు (సాయి రాజేష్ నీలం) లభించింది. ఈ చిత్రంలోని గాయకుడు పివి ఎన్ఎస్ రోహిత్ ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా నిలవడం మరో గర్వకారణం. బాలనటిగా సుకృతి వేణి (దర్శకుడు సుకుమార్ కుమార్తె) “గాంధీ తాత చెట్టు” చిత్రంతో జాతీయ గుర్తింపు పొందింది.
ఇతర భాషల సినిమాలకు లభించిన అవార్డులు
తమిళంలో “పార్కింగ్”, బెంగాలీలో “డీప్ ఫ్రిడ్జ్”, హిందీలో “కథల్”, కన్నడలో “కందీలు” వంటి చిత్రాలు తమ భాషా విభాగాల్లో ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడిగా షారుక్ ఖాన్ (జవాన్) , విక్రాంత్ మెస్సీ (12th ఫెయిల్) , ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ (Mrs ఛటర్జీ వర్సెస్ నార్వే) ఎంపిక కావడం బాలీవుడ్ అభిమానులకు సంతోషకర విషయం. ఉత్తమ సంగీత దర్శకులుగా జీవీ ప్రకాష్ కుమార్ (వాతి) , హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్) లను పురస్కరించారు.
నాన్-ఫీచర్ విభాగాల్లో ప్రత్యేక గుర్తింపులు
నాన్-ఫీచర్ విభాగంలో ఉత్తమ డాక్యుమెంటరీగా “గాడ్ వల్చర్ అండ్ హ్యూమన్” (ఇంగ్లీష్, హిందీ, తెలుగు) ఎంపికైంది. ఉత్తమ నరేషన్, దర్శకత్వం, స్క్రిప్ట్ విభాగాల్లోనూ పలు సినిమాలు అవార్డులు పొందాయి. మలయాళ చిత్రం “నేకల్ – క్రానికల్ ఆఫ్ ది ప్యాడీ మాన్”, ఒడియా చిత్రం “ది సీ అండ్ సెవెన్ విలేజెస్” స్పెషల్ మెన్షన్ అందుకున్నాయి. మొత్తం మీద 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో తెలుగు చిత్రాలు దుమ్ము రేపి, భారతీయ చిత్రసీమలో తమ ప్రత్యేక స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాయి.
Read Also : Donald Trump : ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్ కంటే అమెరికాకే అధిక నష్టం