ఎఫ్డీసీ ఛైర్మన్‌గా ఉన్న దిల్ రాజు (Dil Raju) పైరసీ సమస్యపై స్పందించారు. సినిమా రిలీజ్ రోజే ఆన్లైన్‌లో సినిమా లీక్ అవుతూ ఉండటంతో నిర్మాతలు, డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో పరిశ్రమ సమస్యల పరిష్కారానికి సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని దిల్ రాజు వెల్లడించారు.
పైరసీ నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
పైరసీ (Piracy ) నియంత్రణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసే యోచనలో ఉన్నామని దిల్ రాజు తెలిపారు. ఈ కమిటీ వివిధ రంగాల నిపుణులతో కూడి, సినిమా విడుదలకు ముందు, విడుదల అనంతరం ఆన్‌లైన్ మానిటరింగ్, కాపీరైట్ ఉల్లంఘనల పర్యవేక్షణ చేస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టెక్నికల్ టీమ్‌ను నియమించనున్నారు. పైరసీతో పోరాటం చేయాలంటే, అధికార యంత్రాంగం, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, పరిశ్రమ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
నూతన నిబంధనలు, డిజిటల్ అనుమతులు
భవిష్యత్‌లో చిత్రీకరణలకు ఆన్లైన్ అనుమతుల ప్రక్రియను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇదే సమయంలో పైరసీకి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించేందుకు కొత్త నిబంధనలు తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు దిల్ రాజు తెలిపారు. నిర్మాతలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ చర్యలతో సినీ పరిశ్రమను పరిరక్షించే దిశగా ఒక కీలక ముందడుగు వేస్తున్నామని అన్నారు.
Read Also : TTD : టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ముగ్గురికి బెయిల్