ముంబయి: ప్రముఖ బాలీవుడ్ హీరో సోనూ సూద్ గురించి అందరికీ తెలుసు.. బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ కూడా ఈయనకు మంచి క్రేజ్ ఉంది. తెలుగు సినిమాలో సోనుసూద్ ఎక్కువగా విలన్ పాత్రలో నటించి సినీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే సోనుసూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో పంజాబ్‌లోని లుథియానా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో తెగ షేర్ కావడంపై సోనుసూద్ అసహనం వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై పోస్ట్ పెట్టారు.
సోషల్ మీడియా వేదికగా హల్‌చల్ చేస్తున్న వార్తపై సంచలనాత్మకమైన విషయాలను స్పష్టం చేయాలి. విషయం సూటిగా చెప్పాలంటే నాకు ఎటువంటి సంబంధం లేని అంశం విషయంలో కోర్టు నన్ను సాక్షిగా పిలిచింది. మా న్యాయవాదులు కోర్టుకు సమాధానమిచ్చారు. ఫిబ్రవరి 10న దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాను. నా ప్రమేయం లేని విషయాలను మీ అందరికీ స్పష్టంగా వివరిస్తాను. ఆ కేసుకు, నాకు ఏవిధమైన సంబంధం లేదు. దీనిపై మీడియా అనవసరంగా దృష్టి సారిస్తుంది. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరం అని సోనుసూద్ వివరించారు.
కాగా, లుథియానా కు చెందిన అడ్వకెట్ రాజేశ్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ. 10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు పెట్టారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సోనూ సూద్ సాక్షిగా ఉన్నారని సదరు న్యాయ మూర్తి తెలిపాడు.. ఈ కేసు పై విచారణ జరిపిన కోర్టు సోనూ సూద్ కు నాన్ బెయిలాబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సోనూసూద్ కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరవ్వలేదు. వెంటనే అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ కేసును ఈ నెల 10 న మరోసారి విచారణ జరిపించడం ఉన్నట్లు తెలుస్తుంది.