దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇప్పుడు నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఇటీవల ఆమె ‘త్రలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే బ్యానర్‌ను స్థాపించి, స్వీయ నిర్మాణంలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను ప్రకటించింది. అయితే ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి అప్‌డేట్స్ రాకముందే మరో సినిమా ‘శుభం’ను సైలెంట్‌గా పూర్తి చేసింది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి వసంత్ మరిగంటి కథను అందించగా, ఇప్పటికే టీజర్‌కు మంచి స్పందన లభించింది.

సమంత ‘శుభం’
ఈ సినిమాలో శ్రియ కొంఠం, హర్షిత్ మల్గిరెడ్డి, చరణ్ పెరి, షాలిని కొండేపూడి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ‘శుభం’ సినిమాను మే 9న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇదే తేదీన పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘హరి హర వీరమల్లు’ కూడా రిలీజ్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడంపై సినీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.
పవన్ తో పోటీ
అయితే పవన్ కళ్యాణ్ మూవీ మరోసారి వాయిదా పడే అవకాశం ఉందన్న టాక్ నేపథ్యంలో సమంత తన సినిమాకు ఆ డేట్‌ను లాక్ చేశారన్న ప్రచారం ఉంది. ‘హరి హర వీరమల్లు’ వంటి బడా సినిమాతో పోటీ పడాలనే ధైర్యమేనా? లేక అది వాయిదా పడుతుందని తెలిశాకే డేట్ ఫిక్స్ చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.