పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu )చిత్రం అఖండ విజయాన్ని సాధించినప్పటికీ, కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ తీవ్రంగా మండిపడ్డారు. “ఇది చారిత్రక నేపథ్యాన్ని కల్పితంగా అల్లిన సినిమా” అని దర్శకుడు, నటులు విడుదలకు ముందే వెల్లడించారని ఆయన పేర్కొన్నారు. ఔరంగజేబు ఆకృత్యాలను చూపించడాన్ని బట్టి, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మిడ్నైట్ షో నుంచే ప్రేక్షకులు మంచి స్పందన చూపించారని, ఈ విజయంతో కొన్ని వర్గాలు అసహనంతో తప్పుడు ప్రచారాలకు దిగుతున్నాయన్నారు.
ఔరంగజేబు చరిత్ర చూపితే ఎందుకీ ఉద్వేగం?
రియాజ్ మాట్లాడుతూ, ఔరంగజేబు నిజమైన చరిత్రను సినిమాలో చూపించారని, ఆయన చేసిన అకృత్యాలు చరిత్రలో స్పష్టంగా నమోదై ఉన్నాయని గుర్తు చేశారు. తన సోదరుడిని హత్య చేయడం, తండ్రిని బంధించడంతో పాటు, అనేక మంది ప్రజలపై దురాగతాలు చేసిన చరిత్రను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారని తెలిపారు. అయినప్పటికీ ఈ చిత్రం ఎక్కడా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేయలేదని స్పష్టం చేశారు. హిందూ, ముస్లిం సమాజాల మధ్య స్నేహాన్ని, ఆప్యాయతను చాటే దృశ్యాలు కూడా చిత్రంలో ఉన్నాయని వివరించారు.
ఢిల్లీ ఏపీ భవన్‌లో హరిహర వీరమల్లు ప్రదర్శన
పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో శని, ఆదివారాల్లో రెండు షోలు ఏర్పాటయ్యాయి. శనివారం జరిగిన మొదటి షోకు హౌస్‌ఫుల్ స్పందన లభించగా, ఆదివారం సాయంత్రం మరో షో వేయనున్నట్లు రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ తెలిపారు. దేశ రాజధానిలోని తెలుగు ప్రేక్షకులకోసం చిత్ర ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Read Also : Telangana Rains : హైదరాబాద్ వాసులకు వర్షాల నుంచి రిలీఫ్