దర్శకుడు మారుతి తదుపరి చిత్రం గురించి సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలపై ఆయన బృందం స్పందించింది. దర్శకుడు మారుతి తన తదుపరి చిత్రాన్ని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో, మెగా ఫ్యామిలీకి చెందిన హీరోతో చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే, ఈ వార్తలను మారుతి టీమ్ ఘాటుగా ఖండించింది. అదంతా కేవలం తప్పుడు ప్రచారమని, అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. తదుపరి ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు జరుగుతున్న మాట నిజమే అయినా, ఏ హీరోతో సినిమా అనేది ఇంకా ఖరారు కాలేదని, అనవసరమైన ఊహాగానాలను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన ‘రాజాసాబ్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హర్రర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. మారుతి మార్కు వినోదం మరియు ప్రభాస్ మాస్ ఇమేజ్‌ను కలిపి చూపిస్తారని ఆశించిన ప్రేక్షకులకు ఈ చిత్రం కొంత నిరాశనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో మారుతి తన తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తన తదుపరి చిత్రం ద్వారా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని ఆయన పట్టుదలతో ఉన్నారు.
తన తదుపరి సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని మారుతి బృందం పేర్కొంది. కథా చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే పూర్తి వివరాలతో కూడిన ప్రకటన వస్తుందని తెలిపారు. అప్పటివరకు అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని కోరారు. మారుతి మళ్లీ తన స్ట్రాంగ్ జోనర్ అయిన కామెడీ ఎంటర్‌టైనర్‌తో వస్తారా లేదా ‘రాజాసాబ్’ తరహాలో కొత్త ప్రయోగాలు చేస్తారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.