సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అరెస్టైన సినీ నటుడు అల్లు అర్జున్‌కు హైకోర్టు భారీ ఊరట కల్పించింది. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా, ఈ కేసును కొట్టేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ అవసరం లేదని, కానీ బెయిల్ మంజూరులో అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ న్యాయవాది మాత్రం ఈ కేసులో బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. కోర్టు ముందు వాదనలు వినిపించిన అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ రెడ్డి ఈ ఘటనకు అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదని వాదించారు. ముందుగానే బందోబస్తు ఏర్పాటుకు సమాచారం ఇచ్చారని, ఉద్దేశపూర్వకంగా ఈ ఘటన జరగలేదని వివరించారు.
ప్రభుత్వ న్యాయవాది మాత్రం అల్లు అర్జున్‌పై నమోదైన అభియోగాలను పరిగణలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. కేసును రద్దు చేయడం అన్యాయం అవుతుందని పేర్కొన్నారు. అయితే న్యాయమూర్తి, అల్లు అర్జున్‌కు బెయిల్ ఇవ్వడంపై ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. తుది నిర్ణయం ప్రకటించే ముందు, న్యాయస్థానం క్వాష్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. అయితే తక్షణమే షరతులతో కూడిన బెయిల్ మంజూరుతో అల్లు అర్జున్‌కు తాత్కాలికంగా ఊరట లభించింది. ఈ కేసుపై మరింత విచారణ సోమవారం జరగనుంది.