Acer India : ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ ఎల్‌అండ్‌టీ బాటలోనే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఏసర్ ఇండియా మహిళా ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని ప్రకటించింది. నెలసరి సమయంలో ఒక రోజు పెయిడ్ లీవ్ ను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇది మహిళల సాధారణ సెలవులపై ఎలాంటి ప్రభావం లేకుండా నెలసరి సమయంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి వీలు కల్పిస్తుందని తెలిపింది. మాతృక పేరిట ఈ లీవ్‌ను అందించనుంది. మాతృక నెలసరి విధానంతో.. మహిళల ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రత్యేక దృష్టిసారించాం అని ఏసర్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ కోహ్లీ అన్నారు.

5 వేల మంది మహిళా ఉద్యోగులకు ప్రయోజనం
కొన్నివారాల క్రితం ఎల్‌అండ్‌టీ సంస్థ ఈ తరహా లీవ్‌ను ప్రకటించింది. దానివల్ల సుమారు 5 వేల మంది మహిళా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ఎల్‌అండ్‌టీ ఛైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ ఆ మేరకు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఎల్‌అండ్‌టీ మాతృ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఈ ప్రయోజనం వర్తించనుంది.
నెలసరి సెలవులు మంచి నిర్ణయమే
ఫైనాన్షియల్, టెక్నాలజీ వంటి అనుబంధ సంస్థల్లో పనిచేసే వారికి వర్తించదు. ఇక, ఇప్పటికే స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు ఇదే తరహా ప్రకటన చేశాయి. బిహార్, ఒడిశా, సిక్కిం, కేరళ రాష్ట్రాలు సైతం నెలసరి సెలవు విషయంలో పాలసీని అమలు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు గతేడాది ఈ విషయంలో ఓ పాలసీని రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. నెలసరి సెలవులు మంచి నిర్ణయమే అయినప్పటికీ.. దానివల్ల మహిళలు ఉద్యోగ అవకాశాలకు దూరంకాకుండా చూసుకోవాలని అభిప్రాయపడింది.