మహా కుంభమేళాలో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిన వైరల్ గర్ల్ మోనాలిసా ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మహా కుంభమేళాకు వచ్చే భక్తులు.. మోనాలిసాను చూసేందుకు, ఆమెతో ఫోటోలు దిగేందుకు, వీడియోలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. ఇంకా కొందరైతే ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి విసిగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెను రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకోకుండా అడ్డుపడుతున్నారు. దీంతో ఆమెను కాపాడుకునేందుకు మోనాలిసా కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారి వ్యాపారం సంగతి పక్కనపెడితే.. మోనాలిసాకు, ఆమె కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. దీంతో మోనాలిసాను.. ఆమె తండ్రి.. తమ స్వస్థలం అయిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు పంపించారు.

తాజాగా ఓ వీడియో విడుదల చేసిన మోనాలిసా భోంస్లే.. మహా కుంభమేళాలో తాను ఎంతో ఇబ్బంది పడినట్లు తెలిపింది. తన రక్షణ, తన కుటుంబం సేఫ్‌గా ఉండటం కోసం తాను తమ స్వస్థలం అయిన ఇండోర్ వెళ్లిపోతున్నట్లు తెలిపింది. ఒకవేళ వీలైతే మళ్లీ ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వచ్చే పుణ్యస్నానం వరకు వస్తానని వెల్లడించింది. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచి.. ప్రేమను పంచుతున్న ప్రతీ ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పింది.