తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక అభిషేకం చేయడం అనంతరం స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. గిరి ప్రదక్షిణలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల కొంగుబంగారంగా యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా పునర్నిర్మించారని కవిత కొనియాడారు. ఆలయాన్ని ప్రపంచ స్థాయిలో టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసిన సీఎం కృషిని ప్రశంసించారు. కేసీఆర్ హయాంలో రూ.1200 కోట్లతో ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిన విషయాన్ని కవిత గుర్తు చేశారు.
గతంలో ప్రభుత్వాలు ఆలయ అభివృద్ధికి పెద్దగా దృష్టి పెట్టలేదని, కేసీఆర్ హయాంలో ఇది సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. ఇది కేసీఆర్ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని కవిత అన్నారు. ఈ మహత్తరమైన క్షేత్రానికి స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ఎంతో పవిత్రమైన అనుభూతిగా ఉంటుందని కవిత తెలిపారు. భగవంతుడి ఆశీర్వాదంతో తనకు ప్రజాసేవ చేసే శక్తిని అందించాలని కవిత స్వామివారిని కోరారు. ప్రతినెల స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదక్షణలో భక్తులు పాల్గొని, యాదాద్రీశుడి కృపకు పాత్రులవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణలో భక్తి, ఆధ్యాత్మికతకు ప్రత్యేక స్థానం ఉందని, యాదగిరిగుట్ట ఆలయం దీనికి నిదర్శనమని కవిత తెలిపారు.