తమిళనాడులోని పాంబన్ వద్ద నిర్మించిన కొత్త వర్టికల్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది దేశానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్ట్. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ గైర్హాజరు కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి తప్పకుండా హాజరు కావాల్సింది. కానీ స్టాలిన్ కార్యక్రమానికి రాకపోవడం వెనుక గల కారణాలపై రాజకీయ చర్చ ముదిరింది. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ఒడిదొడుకులు దీనికి దారితీశాయని విశ్లేషకుల అభిప్రాయం.స్టాలిన్ ఇప్పటికే జనాభా గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనపై ఆందోళన వ్యక్తం చేశారు. 1971 జనాభా గణాంకాల ప్రకారమే పునర్విభజన జరగాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధాని పర్యటన సమయంలో స్పష్టంగా ప్రస్తావించారు కూడా.ఇక మరో కీలక అంశం హిందీ భాషా వివాదం.

తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా ఎప్పటి నుంచో గళమెత్తుతున్నారు. కేంద్ర ప్రభుత్వం హిందీని మించిన ప్రాధాన్యం ఇవ్వడం రాష్ట్రానికి అంగీకారంగా లేదన్నది డీఎంకే నేతల భావన.ఈ నేపథ్యంలో మోదీ పాంబన్ లో ఉంటే, సీఎం స్టాలిన్ ఊటీలో ఓ సభలో పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ, “పునర్విభజనపై ప్రధాని ఓ స్పష్టమైన హామీ ఇవ్వాలి, అన్నారు.జనాభా నియంత్రణలో తమిళనాడు ముందంజలో ఉందని స్టాలిన్ చెప్పారు. ఇటువంటి రాష్ట్రాలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల సంఖ్య తగ్గకూడదు, కేంద్రం న్యాయం చేయాలి,” అని స్పష్టం చేశారు.ఈ అంశంపై ప్రధాని నుంచి స్పందన వచ్చే వరకు డీఎంకే పోరాటం కొనసాగుతుందని సూచనలున్నాయి. స్టాలిన్ గైర్హాజరు రాజకీయంగా ఉద్దేశపూర్వకమేనని అనేక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.