అమెరికాలో ఓ విమానం మిస్టరీగా అదృశ్యమైంది. 10 మంది ప్రయాణికులతో అలాస్కా మీదుగా వెళ్తున్న ఈ విమానం అకస్మాత్తుగా రాడార్ సిగ్నల్‌కి అందకుండా పోయింది. దీనితో అధికారులు తక్షణమే స్పందించి గాలింపు చర్యలను ప్రారంభించారు. ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
విమాన ప్రయాణ మార్గాన్ని పరిశీలించిన అధికారులు, చివరిసారిగా అది అలాస్కా గగనతలంలో కనిపించినట్లు చెబుతున్నారు. అయితే, ఏమి జరిగిందనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటమే కారణమా? లేక సాంకేతిక లోపం కారణంగా విమానం అదృశ్యమైందా? అనే కోణాల్లో విచారణ జరుగుతోంది.

ఇదిలా ఉండగా, ఇటీవల అమెరికాలో మరో విమాన ప్రమాదం సంచలనంగా మారింది. వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ ఆర్మీ హెలికాప్టర్, ప్రయాణికుల విమానాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ విమానం పోటోమాక్ నదిలో కూలిపోయింది. ఈ విషాదకర ఘటనలో మొత్తం 67 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ రెండు ఘటనలతో అమెరికా విమానయాన రంగంలో భద్రతపై తీవ్ర చర్చ జరుగుతోంది. నిపుణులు విమాన ప్రమాదాల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపాలు, భద్రతా ప్రమాణాల లోపాలు, వాతావరణ మార్పుల ప్రభావం వంటి అంశాలను పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం అదృశ్యమైన విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రక్షణ బృందాలు, కోస్ట్‌గార్డ్ అధికారులు విమానం చివరిసారిగా కనిపించిన ప్రాంతంలో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. త్వరలోనే ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.