తెలంగాణలో ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) తనకు కేటాయించిన శాఖలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ “నాకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయి. ఇది అదృష్టమో, దురదృష్టమో నాకు తెలియదు” అంటూ స్పష్టంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. పదేళ్లుగా నిర్వీర్యంగా మారిన మత్స్యశాఖను తనకు అప్పగించారని, దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
పశుసంవర్ధక శాఖలో కష్టాలు – యువజన సర్వీస్‌పై స్పష్టత లేదు
పశుసంవర్ధక శాఖలో గత పాలకులు గొర్రెలు, బర్రెలు పేరుతో కిరికిరి చేశారని వాకిటి విమర్శించారు. తాను ఆ శాఖను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. యువజన సర్వీస్ శాఖను కూడా తనకు కేటాయించారని, కానీ ఆ శాఖను ఎలా నడపాలో ఇప్పటికీ తనకు స్పష్టంగా తెలియడం లేదని వ్యాఖ్యానించారు. తనకు ఇచ్చిన శాఖలు చాలా సంక్లిష్టమైనవని, కానీ తాను భయపడకుండా ముందుకెళతానని చెప్పారు.
శాఖలను ఆదర్శంగా తీర్చిదిద్దే సంకల్పం
“ఎంత కష్టమైనా ఈ శాఖలను అద్భుతంగా తీర్చిదిద్దుతా” అంటూ మంత్రి శ్రీహరి తన ధైర్యాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలనలో శాఖల మధ్య సమన్వయం లేకపోతే సమస్యలు ఎదురవుతాయని, కానీ తన అనుభవంతో వాటిని అధిగమిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంత్రివర్గంలో అంతర్గత అసంతృప్తిని సూచిస్తున్న ఈ వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
Read Also : Srisailam Dam Gates : రేపు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్న సీఎం చంద్రబాబు ?