అమరావతి: ఏపీలో మహిళల కోసం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా ఇచ్చిన మరో కీలకమైన హామీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. ఈ హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ఈ ఉగాది నుంచి అమలు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం విధివిధానాలు, అమలు అంశంపై మంత్రులతో కూడిన కమిటీ అధ్యయనం చేస్తోంది.. ఆ నివేదిక రాగానే చర్చించి ఉచిత బస్సు ప్రయాణంపై అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు. అయితే ఉచిత బస్సు పథకం అమలుపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు.

ఏ జిల్లా మహిళలకు.. ఆ జిల్లాలో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం
ఏ జిల్లా మహిళలకు.. ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించాం అని మంత్రి ప్రకటన చేశారు. శాసనమండలిలో సూపర్‌సిక్స్ పథకాల అమలును వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు ప్రస్తావించారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం కచ్చితంగా ఉంటుందని తేల్చి చెప్పారు. కాకపోతే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు మాత్రం అనుమతి ఉండదన్నారు. తాము ఎన్నికల సమయంలో కూడా మహిళలకు జిల్లాలో ఉచిత ప్రయాణం అని హామీ ఇచ్చామని మంత్రి తెలిపారు.
మ్మెల్సీలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం
ఈ అంశంపై స్పష్టత ఇస్తున్నామని ప్రకటించారు. శాసనమండలిలో బడ్జెట్‌పై ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, అశోక్‌బాబు, వరుదు కళ్యాణి, చంద్రశేఖర్‌రెడ్డి, వంకా రవీంద్ర తమ అభిప్రాయాలను తెలిపారు. శాసనమండలిలో మద్యం అంశంపైనా వాడీవేడి చర్చ జరిగింది.. వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం నడిచింది. గత ప్రభుత్వం మద్యపాన నిషేధం పేరుతో ఏం చేసిందో తెలుసంటూ వైసీపీకి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి కౌంటరిచ్చారు.