న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2024-25 ఆర్థిక సర్వే ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం పూర్తయిన తర్వాత, ఆమె ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లా సభను శనివారానికి వాయిదా వేశారు. రేపు (ఫిబ్రవరి 1న) కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ సభకు సమర్పించనున్నారు.

కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా కొనసాగుతోంది. గత ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతి, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేయడానికి ఈ ఎకనమిక్ సర్వే ఉపయోగపడుతుంది. ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్‌లోని ఎకనమిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంది. 1950-51 నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్‌తో పాటు ప్రవేశపెట్టేవారు. అయితే, 1960 తర్వాత బడ్జెట్‌కు ఒక రోజు ముందుగా ప్రవేశపెట్టే సంప్రదాయం ప్రారంభమైంది. ఈరోజు నుంచి ఫిబ్రవరి 13 వరకు మొదటి విడత బడ్జెట్ సమావేశాలు… మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వరకు రెండో విడత బడ్జెట్ సెషన్స్ జరగనున్నాయి.
ఎకానమిక్ సర్వే అంటే ఏమిటి?..
భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు, ప్రభుత్వ పాలసీలు, వచ్చే ఆర్థిక సంవత్సరం ఎలా ఉండబోతుందని అని ఆర్థిక సర్వే వివరిస్తుంది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్-ఏ దేశ ఆర్థిక పనితీరును విశ్లేషిస్తుంది. స్థూల ఆర్థిక సూచికలు, ఆర్థిక ధోరణులను ప్రతిబింబిస్తుంది. పార్ట్ – బీ లో విద్య, వాతావరణ మార్పు, డీజీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం వంటి సామాజిక ఆర్థిక విషయాలను వివరిస్తుంది.