రోహిత్ కొత్త కారును కొనుగోలు చేసిన వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్
తెలంగాణలో అత్యంత పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రూ.3 కోట్ల విలువైన మెర్సిడెజ్ బెంజ్ జీ580 ఈక్యూ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. ఇటీవల ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో విడుదలైన ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అత్యాధునిక సదుపాయాలతో ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. మైనంపల్లి రోహిత్ గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.
రోహిత్ కొత్త కారును కొనుగోలు చేసిన వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. బ్లాక్ షేడ్ కలిగిన ఈ కారును ఆయన సొంతం చేసుకోవడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. మెర్సిడెజ్ బెంజ్ జీ580 ఈక్యూ లుక్ పరంగా ప్రముఖ జీ-వాగెన్ ఐస్ వెర్షన్‌ను పోలి ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో రెండు 12.3 అంగుళాల డిస్‌ప్లేలు ఉండగా, ఒకటి ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్ కోసం, మరొకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం అందుబాటులో ఉన్నాయి.
ఈ కారులో మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హీట్ & కూల్ సీట్లు వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. నాలుగు చక్రాలకు నాలుగు మోటార్లు ఉండటంతో ఈ ఎలక్ట్రిక్ కారు అధిక శక్తిని ప్రదర్శించగలదు. 116 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో నడిచే ఈ ఎస్‌యూవీ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 473 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
ఈ వేరియంట్‌లో ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ అందుబాటులో ఉండటంతో కేవలం 32 నిమిషాల్లోనే బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. అత్యుత్తమ వేగాన్ని అందించగల ఈ కారు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5 సెకన్లలోనే అందుకోగలదు. దీని గరిష్ఠ వేగం గంటకు 180 కిలోమీటర్లు. మెర్సిడెజ్ బెంజ్ గ్లోబల్ మార్కెట్లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. దీని ఎక్స్-షోరూం ధర రూ.3 కోట్లు కాగా, రోడ్డు ధర మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.