Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లండన్‌లో ఉన్న విషయం తెలిసిందే. హౌస్ ఆఫ్ కామన్స్.. యూకే పార్లమెంట్‌లో చిరంజీవిని ఘనంగా సత్కరించారు. ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ (జీవిత సాఫల్య పురస్కారం) పురస్కారాన్ని చిరంజీవికి ప్రదానం చేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకిగానూ చిరంజీవికి ఈ గౌరవం దక్కింది.

మెగా అభిమానులు చిరంజీవికి శుభాకాంక్షలు
యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా నేతృత్వంలో ఈ సత్కారం జరిగింది. పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్‌మాన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. చిరంజీవిని సత్కరించి ఈ అవార్డు ఇచ్చిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలానే తెలుగువారికి, దేశానికి మరిన్ని పేరు ప్రఖ్యాతలు చిరంజీవి తెచ్చిపెట్టాలంటూ ఆకాంక్షిస్తున్నారు.
‘గిన్నిస్ బుక్ వరల్డ్’ రికార్డుల్లోకి
ఇక చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో అవార్డులను అందుకున్నారు. గతేడాది మెగాస్టార్ ఏకంగా ‘గిన్నిస్ బుక్ వరల్డ్’ రికార్డుల్లోకి కూడా ఎక్కారు. 156 సినిమాల్లో 537 పాటల్లో 24 వేల స్టెప్పులతో ఆడియన్స్‌ని అలరించినందుకు గాను చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. అలానే పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందించి కేంద్ర ప్రభుత్వం చిరుని గౌరవించింది.