Chhattisgarh : ఈరోజు (శనివారం) ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈక్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు 16 మందిని హతమార్చారు. కెర్లపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కాల్పులు చోటుచేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్‌గార్డ్ , సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. వారు అమర్చిన ఐఈడీ పేలిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈమేరకు బీజాపూర్ పోలీసులు వెల్లడించారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లే మార్గంలో మావోయిస్టులు గతంలో ఐఈడీ అమర్చారు. అడవిలో పండ్లు ఏరుకునేందుకు తన పిల్లలతో కలిసి వెళ్లిన మహిళ తిరిగి ఇంటికి వస్తుండగా.. అనుకోకుండా దానిపై కాలు వేయడంతో ఒక్కసారిగా అది పేలిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా.. ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు ఆమెను దగ్గర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.