హైదరాబాద్: భారత దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలిపేందుకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. ఈనెల 26న కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సభ సంతాపం తెలిపింది. సభ ప్రారంభం కాగానే సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను సీఎం రేవంత్ గుర్తుచేసుకున్నారు. ఆర్థిక సంస్కరణల రూపకల్పి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. దేశానికి ఆయన విశిష్ట సేవలు అందించారన్నారు. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని రేవంత్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి, కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి విశిష్ట సేవలందించారు. ప్రధానిగా పదేళ్లు అద్భుతమైన పాలన అందించారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. తెలంగాణ రాష్ట్రానికి మన్మోహన్ ఆత్మబంధువు. తెలంగాణతో ఆయన బంధం విడదీయరానిది. రాష్ట్రహోదా కల్పించిన మానవతావాది. తెలంగాణ ప్రజల గుండెల్లో మన్మోహన్ స్థానం శాశ్వతం. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ దశ దిశను మార్చింది. మన్మోహన్ ఆనాడు తీసుకున్న నిర్ణయాలు నేటికి పాటిస్తున్నాం. నేడు దివంగత ప్రధానికి సంతాపం తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. ఇదివరకే మన్మోహన్ మృతితో ఏడు రోజుల సంతాప దినాలు ప్రకటించి అమలు చేస్తోంది. సంతాప దినాలలోనే మన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలిపి, శాసనసభ వేదికగా ఘనంగా నివాళి అర్పిస్తున్నారు.