న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఉదయం 11.45 గంటలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఈ యాత్ర మొదలైంది. నిగంబోథ్ ఘాట్ వరకూ యాత్ర కొనసాగనుంది. నిగమ్‌బోధ్ ఘాట్‌లో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు. ఈ క్రమంలోనే భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ సహా ఇతర వీవీఐపీలు కూడా ఆయన చివరి దర్శనానికి హాజరుకానున్నారు.
కాగా, ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డు మన్మోహన్ సింగ్ నివాసంలోనే ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం ఇవాళ ఉదయం 8 గంటలకు అక్కడి నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచారు. అనంతరం అక్కడి నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. సంస్కరణలతో దేశార్థికాన్ని నవ్యపథంలో నడిపించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు యావత్ భారతావని శుక్రవారం కన్నీటి నివాళులర్పించింది.
మన్మోహన్ సింగ్ గురువారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన నివాసంలో మాజీ ప్రధానికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఇక ఇవాళ ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్ భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు మన్మోహన్ పార్థివదేహం వద్ద అంజలి ఘటించారు.