కాఠ్మండు పొరుగు దేశం నేపాల్ (NePal) రాజకీయంగా తీవ్ర సంక్షోభంలోకి జారింది. సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు ఊహించని స్థాయికి చేరుకుని, హింసాత్మక రూపం దాల్చాయి. ఈ పరిణామాల మధ్య, ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలు ముదిరి అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
సోషల్ మీడియా నిషేధం.. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం
ప్రభుత్వం ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) లాంటి సామాజిక మాధ్యమాలపై భద్రతా కారణాలు చెబుతూ నిషేధం విధించింది. అయితే ఇది ప్రజల ఆగ్రహానికి దారితీసింది. అవినీతి ఆరోపణలతో పాటు స్వేచ్ఛకు చెక్ పెట్టిందన్న భావనతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు.
పార్లమెంట్‌కి నిప్పు.. ఉద్రిక్తతల ముద్ర
మంగళవారం నిరసనలు తీవ్రంగా ముదిరి, కొందరు నిరసనకారులు నేపాల్ పార్లమెంట్ భవనంలోకి చొరబడి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడగా, మరికొందరు మృతి చెందినట్టు సమాచారం. దేశ రాజధాని కాఠ్మండు నుంచి పోఖారా వరకూ ప్రజల ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది.
ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా.. దుబాయ్‌కు పారిపోయారా?
నేపాల్‌లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli)తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుతం దుబాయ్‌లో ఆశ్రయం పొందినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ, ప్రభుత్వం నుంచి దీనిపై అధికారిక ప్రకటన లేదు.
బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా ఆవేదన
నేపాల్ మూలాలున్న ప్రముఖ బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా,దేశం నేపాల్‌లో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ఇది కేవలం బూటు ఫొటో కాదు, మా దేశంలో హింసకు నిదర్శనం,” అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. మరో పోస్టులో, “ఇది నేపాల్ చరిత్రలో ఒక చీకటి రోజు. ప్రజల గొంతును బుల్లెట్లతో ముంచెయ్యడం దుర్మార్గం,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కర్ఫ్యూలతోనూ తగ్గని ప్రజాగ్రహం
ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తేయాలనే ఉద్దేశంతో కాఠ్మండు, లలిత్‌పూర్, పోఖారా, బుత్వాల్ తదితర ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ ప్రకటించింది. అయినప్పటికీ, నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. దేశవ్యాప్తంగా అశాంతి వాతావరణం కొనసాగుతోంది.
Read hindi news:hindi.vaartha.com
Read also: