మంచు ఫ్యామిలీ మధ్య గల అంతరంగ విభేదాలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కుటుంబ కలహాలు చివరికి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాయి. మంచు విష్ణు, మోహన్ బాబు ఒకవైపు ఉంటే, మనోజ్ తన భార్యతో కలిసి వేరుగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ భావోద్వేగ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది.
మనోజ్ భావోద్వేగ పోస్ట్
“హ్యాపీ బర్త్‌డే నాన్న.. మనమంతా కలిసి వేడుక చేసుకునే ఈరోజు మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయా. మీతో మళ్లీ కలిసి ఉండే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా. లవ్ యూ” అంటూ మంచు మనోజ్ తన భావాలను వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌తో పాటు, తండ్రితో చిన్నప్పుడు గడిపిన అపురూపమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఒక వీడియోను కూడా జత చేశారు. కుటుంబ విభేదాల కారణంగా ఆయన తండ్రితో కలిసేందుకు అవకాశం లేకపోవడం ఆయనను ఎమోషనల్‌గా మార్చినట్లు స్పష్టమవుతోంది.

మోహన్ బాబుకు మంచు లక్ష్మి శుభాకాంక్షలు
మరోవైపు, మంచు లక్ష్మి కూడా తన తండ్రి మోహన్ బాబుకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. “హ్యాపీ బర్త్‌డే నాన్న.. మీరు ఆయురారోగ్యాలతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ఎల్లప్పుడూ ప్రార్థిస్తుంటా” అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఆమె తన ప్రేమను వ్యక్తం చేశారు. కుటుంబంలో జరుగుతున్న పరిణామాల మధ్య లక్ష్మి కూడా తన పాత్రను నిబ్బరంగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
మంచు కుటుంబంలో ఆస్తి వివాదం
ఇటీవల మంచు కుటుంబంలో ఆస్తి వివాదం చర్చనీయాంశంగా మారింది. తాను కష్టపడి సంపాదించి నిర్మించిన ఇల్లు, ఆస్తులను మనోజ్ అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడంటూ మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మనోజ్ తన అనుచరులతో కలిసి ఇంటిని ఆక్రమించేందుకు దౌర్జన్యానికి ఒడిగట్టాడని, అడ్డొచ్చిన వారిపై దాడి చేశాడని ఆరోపించారు. ఈ వివాదం త్వరలో ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి.