పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆర్జీ కార్ కేసులో మరణశిక్ష పొందడం కుదరలేదన్న విషయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కోల్‌కతాలో ఈ కేసును సిబిఐకు బదులుగా రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేసి ఉంటే, నిందితుడికి మరణశిక్ష విధించేవారని ఆమె అభిప్రాయపడ్డారు. ముర్షిదాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, “నేను మొదటి నుండి నిందితుడికి మరణశిక్షను కోరుతున్నాను. ఈ కేసు రాష్ట్ర పోలీసుల చేతుల్లో ఉంటే, న్యాయవ్యవస్థకు తగిన తీర్పు తీసుకువచ్చి ఉండేవాళ్లం. సిబిఐ మా నుండి కేసును తీసుకోవడం ఉద్దేశపూర్వకమే,” అని మమతా వ్యాఖ్యానించారు.

సీబీఐ దర్యాప్తుపై నమ్మకం లేదని ఆమె స్పష్టంచేశారు. రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో దర్యాప్తు చేసిన అనేక కేసుల్లో మరణశిక్షలు అమలయ్యాయి. ఈ కేసు తీర్పుపై నాకు సంతృప్తి లేదు అని పేర్కొన్నారు. గత సంవత్సరం ఆగస్టు 9న ప్రభుత్వ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో పీజీ ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ జీవితఖైదుకు శిక్షించబడ్డాడు. కోర్టు తీర్పు ప్రకారం, ఈ కేసు అరుదైన నేరాల జాబితాలోకి రాకపోవడం వల్ల మరణశిక్ష విధించలేదని జడ్జి అనిర్బన్ దాస్ పేర్కొన్నారు. అయితే, ఈ తీర్పు పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చకు దారితీసింది. ఇటువంటి సంఘటనలు న్యాయవ్యవస్థను మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. దోషులకు తగిన శిక్షలు అమలు చేయడంపై పలు వర్గాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి.