సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గ్రామంలోని శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయంలో నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరగనుంది. స్వామి కళ్యాణం ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు. ఈ పర్వదినం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
మల్లన్న స్వామి కళ్యాణం బ్రహ్మోత్సవాల ప్రారంభానికి నాంది పలుకుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కళ్యాణంతో పాటు మూడు నెలలపాటు వివిధ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ ప్రత్యేక సన్నాహాలు చేస్తూ, భక్తుల కోసం అన్నదానం, తాగునీటి ఏర్పాట్లు చేశారు.
ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ , పొన్నం ప్రభాకర్ ఆలయానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు రాజకీయ ప్రముఖులు, వైద్యులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు కూడా హాజరవుతారని సమాచారం. ఈ కార్యక్రమం భక్తులలో ఆధ్యాత్మిక స్పూర్తి నింపుతుందని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణం ప్రస్తుతం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా భక్తులు తరలివస్తున్నారు. స్వామి దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. పూజారులు స్వామి వాహన సేవలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు.