న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఫలితాలు దీనిని ప్రతిబింబిస్తున్నాయని ఆమె అన్నారు. గెలిచిన వారందరికీ అభినందనలు తెలిపారు. మనం అట్టడుగు స్థాయిలో పని చేయాల్సి ఉంది. ఈ ఎన్నికల నుంచి నేర్చుకుని ముందుకు సాగాలన్నారు.
ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ కంగ్రాట్స్ చెబుతూ ఓడిన వారు మరింత కష్టపడాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనా ఢిల్లీ ప్రజల తరపున తమ పోరాటం కొనసాగిస్తామని ప్రియాంక గాంధీ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ గట్టిగానే పని చేసిందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారు.

కాగా, దశాబ్దాల ఘన చరిత్ర. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చామనే పేరు. ఇంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన ఉనికిని కోల్పోతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటలేకపోయింది. ఆప్ అధికారం చేపట్టే కన్నా ముందు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్, ఇప్పుడు మాత్రం ఆ మెరుపులు మెరిపించలేకపోయింది. వరసగా మూడోసారి కాంగ్రెస్ డకౌట్ అయింది. ఈ సారి కూడా ఢిల్లీ ఓటర్లు కాంగ్రెస్‌కి రిక్త హస్తమే మిగిల్చింది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఒక్క చోట కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో లేదు. ఎర్లీ ట్రెండ్స్‌లో బద్లీ నియోజకవర్గంలో ఆధిక్యంలో కనిపించినప్పటికీ, ప్రస్తుతం ఈ స్థానంలో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది.