ఓ కేసులో వాదనలు వినిపిస్తుండగా కుప్పకూలిన న్యాయవాది వేణుగోపాల్
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన చోటు చేసుకుంది. కోర్టు హాలులో న్యాయవాది కుప్పకూలిన ఘటన తోటి న్యాయవాదులను కలచివేసింది. వివరాల్లోకి వెళితే.. న్యాయవాది వేణుగోపాలరావు 21వ కోర్టు హాలులో ఓ కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్న సమయంలో ఒక్కసారిగా కూప్పకూలారు. గమనించిన తోటి న్యాయవాదులు వెంటనే అతన్ని అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

రెగ్యులర్ పిటిషన్లను వాయిదా
అయితే అప్పటికే వేణుగోపాలరావు గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. న్యాయవాది మృతికి సంతాప సూచకంగా 21వ కోర్టులో పిటిషన్ల విచారణను న్యాయమూర్తి నిలిపివేశారు. మిగతా కోర్టుల్లోనూ అత్యవసర పిటిషన్లు, పాస్ ఓవర్ పిటిషన్లను విచారించి.. రెగ్యులర్ పిటిషన్లను వాయిదా వేశారు. సీనియర్ న్యాయవాది మృతితో తోటి లాయర్లు ఆవేదన వ్యక్తం చేశారు.కాగా.. ఇటీవల గుండెపోటు.. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. వృద్ధులకే కాదు నడివయస్కులకు, యువతతో పాటు చిన్నపిల్లలు కూడా ఈ గుండెపోటుతో పిట్టల్లా రాలిపోతున్నారు. కూర్చున్నోళ్లు కూర్చుకున్నట్టుగానే.. నిలబడి ఉంటే అక్కడే.. డ్యాన్స్ చేస్తూ చేస్తూనే.. ఇలా ఎక్కడివాళ్లు అక్కడే.. క్షణాల్లో కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేస్తున్నారు. అప్పటివరకు ఎంతో యాక్టివ్‌గా ఉండి.. ఉన్నట్టుండి ప్రాణాలు వదిలేస్తుండటం సర్వత్రా ఆందోళనకరంగా మారింది.