తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో గత ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు చేస్తూనే, ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కీలక ప్రకటనలు చేశారు.
ఖమ్మం జిల్లా ఏదులాపురంలో మండల కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, గత పదేళ్లలో పాలకులు తెలంగాణ వనరులను విచ్చలవిడిగా దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం స్వలాభం కోసమే పనిచేశారని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ‘ఇందిరమ్మ రాజ్యం’ నడుస్తోందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందని ఆయన పేర్కొన్నారు. అధికార వికేంద్రీకరణలో భాగంగానే కొత్త భవనాల నిర్మాణాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.

పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పునరుద్ఘాటించారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది (2026) ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని ఘనంగా ప్రారంభిస్తామని ఆయన కీలక ప్రకటన చేశారు. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే ఎంపిక ప్రక్రియ వేగవంతమైందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడంతో పాటు, స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇంటిని నిర్మించి ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
Kerala Politics: కేరళ రాజకీయాల్లో దియా సరికొత్త చరిత్ర!
రాబోయే మూడేళ్ల కాలంలో తెలంగాణలో ఇళ్లు లేని నిరుపేద ఒక్కరు కూడా ఉండకూడదనేది తమ ప్రభుత్వ సంకల్పమని పొంగులేటి తెలిపారు. పార్టీల ప్రమేయం లేకుండా, కేవలం అర్హతే ప్రాతిపదికగా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్లు నిర్మితమయ్యే ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి వసతులు ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని ఆయన వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com