తెలంగాణలో మహిళా సాధికారత కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు వారిని కేవలం ప్రయాణికులుగానే కాకుండా బస్సు యజమానులుగా మారుస్తోంది. ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాలు (SHGs) ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, వారి ద్వారా బస్సులను కొనుగోలు చేయించి, వాటిని తిరిగి ఆర్టీసీకి (TGSRTC) అద్దెకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో ప్రైవేట్ వ్యక్తుల నుంచి బస్సులను అద్దెకు తీసుకునే ఆర్టీసీ, ఇకపై ఈ మహిళా సమాఖ్యల బస్సులను వినియోగించుకోనుంది. పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్ల ఏర్పాటుతో పాటు ఇప్పుడు ప్రజా రవాణా వ్యవస్థలోనూ మహిళలకు భాగస్వామ్యం కల్పించడం దేశంలోనే ఇదే తొలిసారి.
Maoist Hidma Encounter : హిడ్మాది ఫేక్ ఎన్కౌంటర్ – ఎమ్మెల్యే కూనంనేని వ్యాఖ్యలు
ఆర్థిక విధివిధానాలు మరియు ఒప్పందం: ఈ పథకం అమలుకు సెర్ప్ (SERP) మరియు టీజీఎస్‌ఆర్టీసీ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. రాష్ట్రవ్యాప్తంగా మండల మహిళా సమాఖ్యల ద్వారా మొత్తం 600 బస్సులను కొనుగోలు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో 17 జిల్లాల్లోని 151 సమాఖ్యలకు బస్సులను కేటాయించారు. ఒక్కో బస్సు ధర రూ. 36 లక్షలు కాగా, ఇందులో రూ. 6 లక్షలు సమాఖ్య తన సొంత నిధుల నుంచి భరిస్తుంది. మిగిలిన రూ. 30 లక్షలను కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ద్వారా రుణంగా అందిస్తారు; దీనికి ప్రభుత్వమే గ్యారెంటీగా ఉంటుంది. ఆర్టీసీ ఒక్కో బస్సుకు నెలకు రూ. 69,648 అద్దె చెల్లిస్తుంది. ఇందులో నిర్వహణ ఖర్చులు రూ. 19,648 పోను, మిగిలిన రూ. 50,000 రుణ వాయిదా కింద జమ అవుతుంది. అంటే అప్పు తీరేకొద్దీ బస్సు పూర్తిగా మహిళా సంఘం సొంత ఆస్తిగా మారుతుంది.

గ్రామీణ రవాణాకు ఊతం – మహిళలకు భరోసా: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రారంభమైన ఈ పథకం ఇప్పటికే సత్ఫలితాలను ఇస్తోంది. ఇప్పటివరకు ఆర్టీసీ నుండి మహిళా సమాఖ్యలకు ఐదు కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి (ఐదు వాయిదాలు). ఈ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం పెరగడమే కాకుండా, మహిళా సంఘాలకు ప్రతినెలా స్థిరమైన ఆదాయం లభిస్తోంది. మొదటి దశ 151 బస్సుల ప్రయోగం విజయవంతం కావడంతో, రెండో దశలో మరో 449 బస్సులను కొనుగోలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూనే, వారికి సామాజిక భద్రతను కల్పించడంలో ఈ పథకం ఒక “రోల్ మోడల్”గా నిలుస్తోందని ప్రభుత్వం భావిస్తోంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/