బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై తీవ్రంగా చూపిస్తుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం, రాబోయే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కొనసాగుతూ ఉండటంతో పాటు, దానితో అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, నైరుతి దిశగా ఒంగి ఉండటం వల్ల వర్షాలు మరింత ప్రభావం చూపుతాయని స్పష్టమైంది.నేడు (ఆదివారం) కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Department of Meteorology) హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతులు, వృత్తిదారులు, రోడ్లపై ప్రయాణించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ ప్రత్యేకంగా సూచిస్తోంది.
ఈదురు గాలులు కూడా వీచే అవకాశం
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు (Gusty winds) కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. మరో మూడు రోజుల పాటు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసింది.ఇక జూన్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే 22 శాతం అధికంగా 694.1 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ కాలంలో 568.4 మి.మీటర్ల వర్షపాతం నమోదవ్వాలి. ఇది రాష్ట్రానికి శుభపరిణామమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

తక్కువ స్థాయిలో వర్షాలు కురుస్తాయని
రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 60 శాతానికిపైగా వర్షపాతం నమోదైందని చెప్పారు. అయితే కొన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం కూడా నమోదైంది. నిర్మల్ జిల్లాలో 28 శాతం, పెద్దపల్లిలో 17శాతం, నల్గొండలో 11 శాతం, మంచిర్యాలలో 5 శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 7 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు తాజా నివేదిక వెల్లడించింది.వాతావరణ శాఖ శనివారం విడుదల చేసిన ముందస్తు సూచనల ప్రకారం.. వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు రాష్ట్రంలో సాధారణం లేదా అంతకంటే తక్కువ స్థాయిలో వర్షాలు కురుస్తాయని అంచనా. అయినప్పటికీ అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం వంటి పరిస్థితుల వల్ల నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైతులు, ప్రజలు వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అకాల వర్షాల వల్ల పంటలకు నష్టం వాటిల్లకుండా చూడటానికి తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: