సమాజానికి నిజమైన మార్పు తీసుకురావాలంటే అది విద్య ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పే వారు చాలా మంది ఉన్నా, దాన్ని ఆచరణలో చూపించేవారు మాత్రం కొద్దిమందే. అలాంటి అరుదైన అధికారి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు (District Collector Hanumantha Rao). బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే విద్యారంగాన్ని అభివృద్ధి పరచాలని ఆయన సంకల్పించారు. చిన్నారుల భవిష్యత్తు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మిన ఆయన, ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించడమే తన ప్రధాన లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
హనుమంతరావు విద్యార్థులతో కలిసిపోయే తీరు నిజంగా ఆదర్శనీయం. ఒక రోజు చాక్ పీస్ పట్టి వారికి పాఠాలు బోధిస్తారు. మరుసటి రోజు గరిటె పట్టి పిల్లలకు స్వయంగా భోజనం వడ్డిస్తారు. ఇలా చేయడం ద్వారా విద్యార్థులు మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు కూడా ప్రేరణ పొందుతున్నారు. “మా కలెక్టర్‌గారు మనతో ఉంటేనే పాఠశాల వాతావరణం కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది” అని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

సిబ్బందిపై సస్పెన్షన్ల వేటు కూడా వేశారు
ముఖ్యంగా హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న ఆహారంపై ప్రత్యేక దృష్టిని సారించారు. ప్రభుత్వ హాస్టళ్ళను ఆకస్మిక తనిఖీ చేస్తూ ఆహార మెనూ పరిశీలిస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందించని ఉపాధ్యాయులు, సిబ్బందిపై సస్పెన్షన్ల వేటు కూడా వేశారు. తాజాగా భువనగిరి పట్టణం (Bhuvanagiri town) లోని కేజీబీవీ స్కూల్, కాలేజీ హాస్టల్ ను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. రోజు మెనూ ప్రకారం విద్యార్థులకు అందించే కర్రీస్, భోజనాన్ని ఆయన పరిశీలించారు.మెనూ ప్రకారం టమాట, గుడ్డు కర్రీ చేయాలి కదా, ఎందుకు చేయలేదని ఎస్‌వోని ప్రశ్నించారు.
అడిగితే గుడ్లు టెండర్ తీసుకున్న వ్యక్తి సరఫరా చేయడం లేదని తెలిపారు. దీంతో సంబంధిత టెండర్‌దారుడికి ఫోన్ చేసిన కలెక్టర్.. ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీబీవీలో వసతి సౌకర్యాలు, నాణ్యమైన ఆహారంపై ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్కూల్ వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులతో విద్య బోధన, పౌష్టికాహారంపై ఆయన ఆరా తీశారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులకు ఆయన సూచించారు. తల్లితండ్రులు, గురువులకు, జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: