క్రీడల ప్రపంచంలో ప్రతి విజయం వెనుక కఠోర శ్రమ, పట్టుదల, క్రమశిక్షణ, త్యాగం దాగి ఉంటుంది. ఈ నిజాన్ని మరోసారి నిరూపించిన వ్యక్తి విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడకు చెందిన వల్లూరి అజయ్ బాబు (Ajay Babu). గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన సీనియర్ కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్లో అజయ్ బాబు తన ప్రతిభను చాటుకుని దేశానికి బంగారు పతకాన్ని అందించాడు.79 కిలోల బరువు విభాగంలో బరిలో దిగిన అజయ్ బాబు, స్నాచ్‌లో 152 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 183 కిలోలు ఎత్తి, మొత్తం 355 కిలోల బరువుతో ప్రత్యర్థులను మట్టికరిపించాడు. ఈ ప్రదర్శనతో ఆయనకు బంగారు పతకం లభించడమే కాకుండా, దేశ క్రీడా రంగంలో మరో కొత్త నక్షత్రం వెలిగిందనే పేరు తెచ్చుకున్నాడు.
తండ్రి నుంచి వచ్చిన ప్రేరణ
అజయ్ బాబు విజయానికి వెనుక ఉన్న అతిపెద్ద శక్తి ఆయన తండ్రి వల్లూరి శ్రీనివాసరావు. 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) లో భారత తరపున పోటీపడి, కాంస్య పతకం సాధించిన ఆయన, వెయిట్‌లిఫ్టింగ్‌లో విశేష కీర్తి తెచ్చిపెట్టారు. తండ్రి సాధన, క్రమశిక్షణ, క్రీడపై ఉన్న అంకితభావం చూసి చిన్ననాటి నుంచే అజయ్ బాబులో స్పూర్తి కలిగింది. “నేను కూడా ఒకరోజు దేశానికి బంగారు పతకం సాధించాలి” అన్న సంకల్పంతో ఆయన ముందుకు సాగాడు.అజయ్ బాబు విజయమంతా కేవలం ప్రతిభ వల్ల కాదు, ప్రతిరోజూ క్రమశిక్షణతో చేసిన సాధన ఫలితం. తెల్లవారుజామున లేచి కఠోర సాధన చేయడం, సమయపాలన పాటించడం, ఆహార నియమాలను కచ్చితంగా అమలు చేయడం వంటి అంశాలు ఆయన జీవితంలో భాగమయ్యాయి. అనేక సార్లు జాతీయ స్థాయి (National level) పోటీల్లో పాల్గొని, అనుభవాన్ని పెంచుకున్నాడు. ఆ అనుభవమే ఈసారి అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని గెలిపించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గర్వకారణం
బంగారు పతకం సాధించడంతో ఆయన స్వగ్రామం కొండవెలగాడతో పాటు జిల్లావాసులు సైతం ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. గ్రామస్తులు, అభిమానులు, క్రీడా ప్రియులు శభాష్ అజయ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. స్థానిక క్రీడా సంఘాలు ఆయన సాధనను మెచ్చుకుంటున్నారు. భవిష్యత్‌లో కూడా ఒలింపిక్స్ సహా మరిన్ని వేదికల పై పతకాలు సాధించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.అజయ్ విజయం కేవలం వ్యక్తిగత గౌరవమే కాకుండా యువతకు క్రీడల వైపు మక్కువ పెంచే ప్రేరణగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పట్టుదల, కష్టపడి శ్రమిస్తే ఎవరైనా విజయ శిఖరాలను అధిరోహించవచ్చని అజయ్ మరోసారి నిరూపించాడు.
Read hindi news: hindi.vaartha.com
Read also: