బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర నిధుల ఆకర్షణ, రైతుల సంక్షేమం తదితర అంశాలపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు.

రెవంత్ ఢిల్లీ పర్యటనలపై కేటీఆర్ విమర్శలు
రేవంత్ రెడ్డి 39 సార్లు ఢిల్లీ వెళ్లి, మీడియా ముందు తన పనులను ఒక్కోసారి ఘనంగా చెప్పుకున్నా, రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తేలేదా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఓటేసి మోసపోయాం అని ప్రజలు నేరుగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, సీఎం మాత్రం ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ విమర్శల్లో ముఖ్యంగా రైతు సమస్యలు ప్రధానంగా చోటు చేసుకున్నాయి. సాగునీటి సమస్యలు, నీటి ఎద్దడి, తాగునీటి సంక్షోభం రాష్ట్రంలో పెరుగుతున్నా, సీఎం మాత్రం కనీస సమీక్షలు కూడా నిర్వహించడం లేదని దుయ్యబట్టారు. “మొహం బాగోలేక అద్దం పగలగొట్టినట్లు, పాలన చేతకాక హామీల అమలు లేక గాలి మాటలు, గబ్బు కూతలు” అంటూ సీఎం రేవంత్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విమర్శల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ దూకుడి మరింత పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో పాలనలో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమవుతుందా? లేదా పాలనను మరింత బలోపేతం చేస్తుందా? అన్నది వేచిచూడాల్సిన విషయం.