హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్ తో రుజువైందన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు చిల్లి గవ్వ కూడా తీసుకురాలేకపోయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన ఎంపీలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రిగా ఉంటూ బీజేపీకి గులాం గిరి చేస్తున్న బడే భాయ్, చోటే భాయ్ అనుబంధంతో తెలంగాణకు నయా పైసా లాభం లేదని తేలిపోయిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు తమ రాష్ట్రాలకు నిధుల వరద పారిస్తుంటే.. తెలంగాణ బీజేపీ ఎంపీలు, నిస్సహాయ మంత్రులు చేతగాని దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంట్ కి పంపిస్తే.. ఆ 16 మంది కలిసి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తెచ్చింది అక్షరాల గుండు సున్నా అని విమర్శించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 సార్లు ఢిల్లీకి వెళ్లింది తెలంగాణకు నిధులు తెచ్చేందుకు కాదని.. తెలంగాణ నుంచి ఢిల్లీకి మూటలు మోసేందుకేనని ఈరోజు తేలిపోయిందన్నారు. నిధులు తేలేని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అంటే కేంద్రానికి ఎంత చిన్నచూపొ మరోసారి పార్లమెంట్ సాక్షిగా ఈ బడ్జెట్ రుజువు చేసిందన్నారు. బడ్జెట్ లో కేవలం బీజేపీ పాలిక రాష్ట్రాలకు పెద్దపీట వేసి, ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేశారని కేటీఆర్ అన్నారు.