హైడ్రా పేరుతో రాష్ట్రంలో వసూళ్ల దందా నడుస్తోందని, అందుకు ప్రభుత్వంలోని పెద్దలు సూత్రధారులని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాలన ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా మారిందని, కాంగ్రెస్ నేతలు తమ అధికారం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మూసీ నది పేరుతో పేదల ఇళ్లపై పగబట్టడం అన్యాయమని, అసలైన అభివృద్ధిని పక్కన పెట్టి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజలను బలిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫోర్త్ సిటీ పేరుతో ముఖ్యమంత్రి కుటుంబం భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పేరుతో పేదల భూములను కార్పొరేట్ సంస్థలకు తాకట్టుపెడుతున్నారని, అసలు ఈ ప్రాజెక్టు వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో మునిసిపల్ ప్రణాళికలు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించగా, కాంగ్రెస్ సర్కార్ కేవలం పెద్దల లాభాల కోసం వాటిని మార్చేస్తోందని విమర్శించారు. ట్రిపుల్ ఆర్ పేరుతో పేదల భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారని కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓవైపు ప్రజలకు సంక్షేమ హామీలు ఇచ్చి మరోవైపు వారి ఆస్తులను లాక్కొనడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో పారదర్శక పాలన లేకుండా పోయిందని, ప్రతిపక్ష నేతలను అణచివేయడం, ప్రశ్నించే గొంతులను నొక్కేయడం కాంగ్రెస్ పాలనకు మారుపేరు అయ్యిందని మండిపడ్డారు.
ఆరు గ్యారంటీలు ఎక్కడ?
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు గాలిలో కలిసిపోయాయని, రైతులకు ఎటువంటి భరోసా అందడం లేదని కేటీఆర్ విమర్శించారు. రుణమాఫీ అమలుకావడం లేదని, పంటల కొనుగోలు కూడా జరగడం లేదని ఆరోపించారు. ఇది పాలన కాదు, పీడనమని ఘాటుగా స్పందించారు. పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 నెలల్లోనే పూర్తిగా వెనుకబడ్డదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిని ప్రక్కన పెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాలనను వక్రీకరిస్తున్నారని, ప్రజలు ఇకనైనా మేల్కొని తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పరిపాలనా తీరును ఉద్దేశించి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఇది ప్రభుత్వంలా పని చేయడం లేదు, ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదు. అసలు ఇది సర్కారు కాదు, సర్కస్ కంపెనీలా తయారైందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా అధికారం దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. “ఇంకా ఎంత కాలం మౌనంగా ఉంటారు? ఇప్పుడైనా ప్రజలు మేల్కొని తమ హక్కులను రక్షించుకోవాలి!” అని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.