కేసీఆర్ వ్యూహంతో రైతులకు తప్పిన ఎరువుల తిప్పలు
హైదరాబాద్: ఏడాది క్రితం వరకు ఎప్పుడు పడితే అప్పుడు ఎరువులు దొరికేవి. కేసీఆర్ హయాంలో రైతులు ఇలా వెళ్లి అలా ఎరువుల బస్తాలు తెచ్చుకొనేవారు. ఏడాదిలోనే పరిస్థితి తలకిందులైందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎరువుల కోసం మళ్లీ క్యూలైన్లు మొదలయ్యాయి. రైతులకు గంటల తరబడి నిలబడే ఓపిక లేక క్యూలైన్లలో చెప్పులు, పాస్‌బుక్కులు దర్శనమిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఎరువుల కోసం నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది.

ఎరువుల గోస తీర్చడంపై ప్రధానంగా దృష్టి
రైతుల వీపుల మీద లాఠీలు విరిగేవి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. ఎరువుల గోస తీర్చడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. వ్యవసాయ శాఖ అధికారులతో రోజుల తరబడి సమీక్షలు నిర్వహించారు. తద్వారా ఎరువుల గోస తీర్చేందుకు ముందస్తు వ్యూహాన్ని అమలుచేయాలని నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో సీజన్ ప్రారంభమయ్యాక, రైతులు పంటలు వేయడం మొదలుపెట్టిన తర్వాత కేంద్రం నుంచి ఎరువులు తీసుకొచ్చేవారు. కేసీఆర్ అందుకు భిన్నంగా సీజన్ ప్రారంభానికి ముందే కేంద్రం నుంచి ఎరువులు తీసుకొనిరావాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు ఎక్కడ అవసరమైతే అక్కడికి వెంటనే సరఫరా
సకాలంలో ఎరువులు రప్పించేందుకు పలువురు అధికారులను ప్రత్యేకంగా ఢిల్లీకి పంపించేవారు. వారంతా రెండు మూడు రోజులు ఢిల్లీలో మకాం వేసి అక్కడి అధికారులతో మాట్లాడి రాష్ర్టానికి అవసరమైన ఎరువులు తీసుకొచ్చేవారు. దీంతో యాసంగి సీజన్‌కు అక్టోబర్, నవంబర్‌లోనే కావాల్సిన ఎరువులను తీసుకొచ్చి, వెంటనే మండలస్థాయికి పంపించి అక్కడ నిల్వ చేసేవారు. దీంతో రైతులకు ఎక్కడ అవసరమైతే అక్కడికి వెంటనే సరఫరా చేసి కొరత లేకుండా చూసేవారు. దీంతోపాటు ఎన్ని ఎకరాలు సాగవుతాయో కచ్చితంగా అంచనా వేసి అందుకు కాస్త అదనంగానే తీసుకొచ్చేవారు. దీంతో కొరత అనే మాటే వినపడలేదని కేటీఆర్ తెలిపారు.