భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (KTR) యూకే పర్యటన (UK Tour) విజయవంతంగా ముగిసింది. మే 27న యూకేకు చేరుకున్న కేటీఆర్‌కు ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న బీఆర్‌ఎస్ నేతలు, అనేక సంవత్సరాలుగా తెలంగాణ వాదాన్ని కొనసాగిస్తున్న ఎన్నారైలు కేటీఆర్‌ను కలవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా గుండె శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న బీఆర్‌ఎస్ నాయకుడు అనిల్‌ను పరామర్శించిన కేటీఆర్, కార్యకర్తలతో ఉన్న అనుబంధాన్ని చాటారు.
పార్టీ కార్యకలాపాలపై సమీక్ష
లండన్‌లో బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ నేతలతో సమావేశమై కేటీఆర్ పార్టీ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధిలో ఎన్ఆర్ఐల పాత్రను ప్రశంసించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి పాలనను ఎత్తిచూపాలని సూచించారు. అదే రోజు యూకే తెలుగు బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశమై, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. భవిష్యత్తు తెలంగాణపై తన నిబద్ధతను మరోసారి ప్రకటించిన కేటీఆర్, పాలనలో ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు.
PDSL సంస్థ నాలెడ్జ్ సెంటర్‌ను ప్రారంభించిన కేటీఆర్
మే 31న వార్విక్ యూనివర్సిటీలో PDSL సంస్థ నాలెడ్జ్ సెంటర్‌ను ప్రారంభించిన కేటీఆర్, ఆ సంస్థ గ్లోబల్ ఆటోమోటివ్ దిగ్గజాలకు సేవలందిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్‌ను ఆటోమోటివ్ హబ్‌గా తీర్చిదిద్దడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలను వివరిస్తూ, యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలన్న ఆకాంక్షను తెలిపారు. యూకే పర్యటన ముగించుకొని కేటీఆర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. యూకే పర్యటన విజయవంతం కావడంపై కేటీఆర్ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Read Also : Kamal Haasan: ‘థగ్ లైఫ్’ విడుదలపై హైకోర్టును ఆశ్రయించిన కమల్ హాసన్