సిరిసిల్ల టౌన్‌లో ఓ సాధారణ టీ స్టాల్ నిర్వాహకుడికి అన్యాయం జరిగిందని భావించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అతనికి భరోసా ఇచ్చారు. ఆదివారం సిరిసిల్ల క్యాంప్ కార్యాలయంలో టీ స్టాల్ నిర్వాహకుడు బత్తుల శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ తన గోడును వెళ్లబోసుకుంటూ, తాను ఎవరికీ ఏ అన్యాయం చేయలేదని, కేవలం తన జీవనాధారాన్ని కొనసాగించుకుంటూ బతుకుతున్నానని అన్నారు. అయితే, సిరిసిల్ల కలెక్టర్ తన హోటల్‌లో కేటీఆర్ ఫొటో ఉందనే కారణంతో టీ స్టాల్ మూయించేశారని బాధపడ్డారు.

టీ స్టాల్ తొలగింపు
టీ స్టాల్ తొలగింపు తర్వాత రెండు రోజులకే అధికారులు హోటల్ డబ్బాను సామానుతో సహా తీసుకెళ్లారని శ్రీనివాస్ వాపోయారు. ఇది తమ కుటుంబాన్ని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేసిందని, తన చిన్న వ్యాపారాన్ని నిలబెట్టుకునేందుకు ఏదైనా సహాయం చేయాలని కేటీఆర్‌ను అభ్యర్థించారు. ఈ విషయాన్ని గమనించిన కేటీఆర్ తనవంతు సహాయం అందిస్తానని, టీ స్టాల్ యజమానికి శాశ్వత ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు.
కేటీఆర్ హామీ
రూ. 10 లక్షలు ఖర్చయినా సరే మంచి టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సహాయపడతానని కేటీఆర్ చెప్పారు. వారం లేదా పది రోజుల్లోనే తాను స్వయంగా వచ్చి కొత్త టిఫిన్ సెంటర్‌ను ప్రారంభిస్తానని భరోసా ఇచ్చారు. అంతేకాదు, అద్దె భారం లేకుండా ప్రత్యామ్నాయ స్థలం కూడా తనే చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ చర్యతో సాధారణ ప్రజలకు తాను అండగా ఉంటానన్న సంకేతాన్ని కేటీఆర్ స్పష్టంగా పంపారు.
కేటీఆర్ కు భరోసాతో బత్తుల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు
కేటీఆర్ ఇచ్చిన భరోసాతో బత్తుల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా తనను ఆదుకున్న కేటీఆర్ సహాయం మరచిపోలేమని అన్నారు. ప్రజాప్రతినిధులు సామాన్యుల పక్షాన నిలబడితేనే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని, కేటీఆర్ ఆదర్శంగా నిలిచారని పలువురు అభిప్రాయపడ్డారు.